bumrah: 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా
- టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదే 45 వికెట్లు పడగొట్టిన బుమ్రా
- 40 వికెట్లతో దిలీప్ దోషి పేరిట ఉన్న రికార్డు
- తర్వాతి స్థానాల్లో వెంకటేష్ ప్రసాద్, నరేంద్ర హిర్వాణీ, శ్రీశాంత్
టీమిండియా పేసర్ బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 39 ఏళ్ల నాటి రికార్డును అధిగమించాడు. మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో బుమ్రా 6 వికెట్లను పడగొట్టి ఆతిథ్య జట్టును కుప్పకూల్చాడు. ఈ నేపథ్యంలో, టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే అత్యధిక వికెట్లను పడగొట్టిన భారత బౌలర్ గా అవతరించాడు.
ఇప్పటి వరకు ఈ రికార్డు లెఫ్టామ్ స్పిన్నర్ దిలీప్ దోషి పేరిట ఉంది. 1979లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన దోషి... ఆ ఏడాది 40 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టుల్లో ప్రవేశించిన చేసిన బుమ్రా ఇప్పటి వరకు 45 వికెట్లను పడగొట్టాడు. దిలీప్ దోషి తర్వాత వెంకటేష్ ప్రసాద్ 37 వికెట్లు (1996), నరేంద్ర హిర్వాణీ 36 (1988), శ్రీశాంత్ 35 (2006)లు ఉన్నారు.