Virat Kohli: కోహ్లీ గొప్ప ఆటగాడే, కానీ.. విరాట్‌పై మరోమారు విమర్శలు గుప్పించిన బాలీవుడ్ నటుడు
- మైదానంలో హుందాగా ప్రవర్తించాలి
- సీనియర్లను చూసి నేర్చుకోవాలి
- ప్రజలు లిప్ రీడింగ్‌ను కూడా చదవగలరు
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తి అయిన బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై మరోమారు విరుచుకుపడ్డాడు. కోహ్లీ ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడంటూ ప్రశంసలు కురుస్తున్న వేళ.. అతడు ఈ ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రవర్తన కలిగిన ఆటగాడని నసీరుద్దీన్ ఇటీవల వ్యాఖ్యానించి కలకలం రేపాడు. అలా అన్నందుకు కోహ్లీ ఫ్యాన్స్ అతడిని ట్విట్టర్‌లో ఓ ఆట ఆడుకున్నారు.
తాజాగా, నసీరుద్దీన్ మరోమారు కోహ్లీపై అటువంటి వ్యాఖ్యలే చేశాడు. కోహ్లీ తన సీనియర్లను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ముఖ్యంగా హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలని షా సూచించాడు. అతడు గొప్ప ఆటగాడన్న విషయాన్ని తాను అంగీకరిస్తానని, ఈ విషయంలో అతడిని ప్రశంసిస్తానని, అయితే మైదానంలో అతడి ప్రవర్తన గురించి అతడే ఆలోచించుకోవాలని అన్నాడు. ప్రజలు లిప్ రీడింగ్ (పెదవుల కదలికలను బట్టి తెలుసుకోవడం) కూడా చేయగలరని, కాబట్టి హుందాగా మెలగడం నేర్చుకుంటే మంచిదని అన్నాడు. క్రికెటర్‌గా కోహ్లీ సాధించిన విజయాలు అతడి దుందుడుకు స్వభావం, చెత్త ప్రవర్తన వల్ల ఎందుకూ కొరగాకుండా పోతున్నాయని నసీరుద్దీన్ షా అభిప్రాయపడ్డాడు.