Kadapa: పంతం నెగ్గించుకున్న చంద్రన్న... కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం!

  • ఉక్క ఫ్యాక్టరీని ఇవ్వలేమని తేల్చిన కేంద్రం
  • తానే నిర్మిస్తానంటూ ముందుకొచ్చిన చంద్రబాబు
  • నేడు భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణ
  • 3 వేల ఎకరాల్లో రూ. 18 వేల కోట్లతో నిర్మాణం
  • ప్రత్యేక రైల్వే లైన్, గండికోట జలాశయం నుంచి నీటి సరఫరా

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మించలేమని కేంద్రం చేతులెత్తేసిన వేళ, రాయలసీమ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఫ్యాక్టరీని తానే స్వయంగా నిర్మిస్తానంటూ ముందుకు వచ్చిన సీఎం చంద్రబాబు, ఈ ఉదయం పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాలదిన్నెకు ఈ ఉదయం వచ్చిన చంద్రబాబు, తొలుత భూమి పూజ చేశారు. ఆపై శిలాఫలకాన్ని, ఫైలాన్‌ ను ఆవిష్కరించడం ద్వారా తన పంతం నెగ్గించుకున్నారు.

కాగా, సాలీనా 3 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తుల తయారీ సామర్థ్యంతో పరిశ్రమ నిర్మితం కానుండగా, ఈ ప్రాంతంలోని 15 వేల మందికి ఉపాధి లభించనుంది. ఫ్యాక్టరీ కోసం జమ్మలమడుగు నుంచి ఎం కంబాలదిన్నెకు 12 కిలోమీటర్ల పొడవైన రైల్వేలైన్‌ ను నిర్మించనున్నారు. ఈ ప్లాంటుకు అవసరమైన నీటిని గండికోట జలాశయం నుంచి తరలించనుండగా, అవసరమైన బొగ్గును విదేశాల నుంచి కృష్ణపట్నం పోర్టునకు దిగుమతి చేయించనున్నారు. ఫ్యాక్టరీ అంచనా వ్యయం రూ. 18 వేల కోట్లు కాగా, 3 వేల ఎకరాల్లో పరిశ్రమను నిర్మితం కానుంది.

Kadapa
Steel Plant
Chandrababu
  • Loading...

More Telugu News