Andhra Pradesh: ప్రపంచమంతా ఇప్పుడు అమరావతివైపు చూస్తోంది.. ఇక్కడి రైతులు చరిత్రలో నిలిచిపోతారు!: చంద్రబాబు
- తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని
- బౌద్ధస్తూపం ఆకారంలో ఐకానిక్ టవర్
- ఒకేసారి 4 వేల కార్ల పార్కింగ్ సౌకర్యం
ఆంధ్రుల రాజధాని అమరావతిని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధానిలో బౌద్ధ స్తూపం ఆకారంలో ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సచివాలయంలో ఐదు టవర్లకు ర్యాఫ్ట్ పనులను చంద్రబాబు ఈ రోజు ఉదయం ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ.. అమరావతిలో 1,375 ఎకరాల్లో పరిపాలన భవనాలు ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచమంతా అమరావతి వైపు చూస్తోందని చంద్రబాబు అన్నారు.
సెక్రటేరియట్ ప్రాంగణంలో దాదాపు 4,000 కార్లను పార్క్ చేసుకునే సదుపాయం ఉంటుందన్నారు. సచివాలయంలోని ఐదు టవర్లను మూడేళ్లలో నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో 50,000 మంది అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. వీరందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం చెప్పారు. పోలవరం నిర్మాణం తుదిదశకు చేరుకుందనీ, మరో 6 నెలల్లో పోలవరం నుంచి సాగునీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.