AAI: విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై స్థానిక భాషల్లోనూ ఎనౌన్స్‌మెంట్!
- ఇప్పటివరకు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే ప్రకటన
- ఇకపై స్థానిక భాషల్లోనూ చేయాలంటూ ఆదేశాలు
- జారీ చేసిన పౌరవిమానయాన శాఖ
విమాన ప్రయాణికులకు ఇది గుడ్ న్యూసే. విమానాశ్రయాల్లో ఎనౌన్స్‌మెంట్ ఇప్పటి వరకు ఇంగ్లిష్, హిందీ భాషలకు మాత్రమే పరిమితం కాగా, ఇకపై స్థానిక భాషల్లోనూ వినిపించనుంది. ఈ రెండు భాషలు తెలియని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఇకపై స్థానిక భాషల్లోనూ ప్రకటన చేయాల్సిందేనంటూ పౌర విమానయాన శాఖా మంత్రి సురేశ్ ప్రభు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆదేశాలు పంపింది. ప్రైవేటు ఆపరేటర్లకు కూడా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. అయితే, సైలెంట్ ఎయిర్‌పోర్టులు (సాధారణ ప్రకటనలు కాకుండా అత్యవసర ప్రకటనలు మాత్రమే చేసే విమానాశ్రయాలు)కు ఇది వర్తించదని పేర్కొంది.