Telangana: తీసుకున్న అప్పు చెల్లించని తండ్రీకొడుకులు.. వేధింపులకు నిరసనగా విద్యుత్ టవర్ ఎక్కిన మధ్యవర్తి!
- తెలంగాణలోని హన్మకొండలో ఘటన
- మూడేళ్ల క్రితం అప్పు తీసుకున్న ఖాదీర్, రజాక్
- కేసు నమోదుచేసిన పోలీసులు
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకుండా వేధిస్తున్న తండ్రీకొడుకుల వ్యవహారశైలిపై ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. అయితే చివరికి సీన్ మొత్తం రివర్స్ కావడంతో పోలీసులు అతనిపైనే కేసు నమోదుచేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని కాశిబుగ్గ ఎస్ఆర్ నగర్ లో ఉంటున్న వెంకటయ్య టైలర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో హన్మకొండకు చెందిన తండ్రీకొడుకులు సయ్యద్ అబ్దుల్‌రజాక్, సయ్యద్ అబ్దుల్‌ఖాదీర్‌లకు మూడేళ్ల క్రితం రూ. 5.40 లక్షల అప్పును ఇప్పించాడు. ఈ సందర్భంగా మధ్యవర్తిగా వ్యవహరించాడు. అయితే తీసుకున్న అప్పుతో పాటు వడ్డీని కూడా తీర్చకపోవడంతో పలుమార్లు ఈ విషయమై గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల వ్యవహారశైలితో విసిగిపోయిన వెంకటయ్య వరంగల్ ఎంజీఎం చౌరస్తాలోని విద్యుత్ టవర్ ఎక్కేశాడు.
పెట్రోల్, పురుగుల మందు డబ్బాలను తనతో పాటు పట్టుకెళ్లాడు. ఎవరైనా కాపాడేందుకు పైకి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. తొలుత విద్యుత్ సరఫరాను ఆపేశారు. అనంతరం అసలు విషయం తెలుసుకుని అప్పు తీసుకున్నవారిని రప్పించారు. తాము వెంటనే తీసుకున్న అప్పును చెల్లిస్తామని రాజక్, ఖాదీర్ లు ఈ సందర్భంగా హామీ ఇవ్వడంతో వెంకటయ్య విద్యుత్ టవర్ దిగాడు. కాగా, టవర్ దిగిన వెంకటయ్యపై పోలీసులు కేసు నమోదుచేశారు.