Vadodara: పొట్టి దుస్తులతో రావద్దు, ఇబ్బంది పడొద్దు: అమ్మాయిలకు వడోదర పోలీసుల న్యూ ఇయర్ వార్నింగ్!
- కురచ దుస్తులతో 'స్కిన్ షో' వద్దు
- అనుచితంగా ప్రవర్తిస్తే కేసులు తప్పవు
- వడోదర పోలీసుల హెచ్చరికలు
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా వీధుల్లోకి వచ్చే అమ్మాయిలు కురచదుస్తులు ధరించవద్దని గుజరాత్ లోని వడోదర పోలీసులు హెచ్చరించారు. చిన్న చిన్న దుస్తులతో బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దని చెబుతూ, న్యూ ఇయర వేడుకల వేళ, ఏం చేయాలో, ఏం చేయరాదో చెబుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ మేరకు వడోదర పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గలౌత్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది.
వేగంగా వాహనాలను నడిపించవద్దని, మద్యం తాగి రౌడీల్లా ప్రవర్తించవద్దని, అనుచితంగా ప్రవర్తిస్తే, కేసులు తప్పవని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరమూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ, అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయని, వారిని అడ్డుకునేందుకు తాము నిర్విరామంగా విధులను నిర్వర్తించనున్నామని తెలిపారు.
అమ్మాయిలకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూస్తామని, అందుకు వారు కూడా సహకరించాలని కోరారు. 'స్కిన్ షో' కూడదని వ్యాఖ్యానించిన ఆయన, దుస్తులు ఎలా ఉండాలన్న విషయమై మరింత వివరణను ఆ ప్రకటనలో పేర్కొనక పోవడం గమనార్హం. ఇదే సమయంలో అన్ని పార్టీల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరని, లౌడ్ స్పీకర్లు వాడరాదని, రాత్రి 10 గంటల తరువాత బాణసంచా కాల్చరాదని ఆయన హెచ్చరించారు.
ఇక ఈ నోటిఫికేషన్ లో అమ్మాయిలకు చెప్పిన జాగ్రత్తలపై విమర్శలు వస్తున్నాయి. తాము ధరించే దుస్తులను ఎంచుకునే హక్కు పురుషులకు ఎలా ఉందో, మహిళలకు కూడా అలానే ఉందని, మోరల్ పోలీసింగ్ పేరిట ఇటువంటి ఆంక్షలేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.