Elections: మాకూ ఓ 'ప్లాన్ బీ' ఉంది: బీజేపీ నేత రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
- ఇటీవలి ఎన్నికల తరువాత మూడు రాష్ట్రాలను కోల్పోయిన బీజేపీ
- చంద్రబాబు, ముఫ్తీ, కుష్వాహల దూరంతో బీజేపీకి నష్టం
- నష్ట నివారణ ప్రయత్నాల్లో బీజేపీ
- కొత్త పార్టీలను కలుపుకునే ప్రయత్నాల్లో ఎన్డీయే
తాము అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలను ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన తరువాత, ఎన్డీయేలోని మిత్రపక్షాలు తమ ధిక్కార స్వరాన్ని పెంచుతున్న వేళ, తమకూ ఓ 'ప్లాన్ బీ' ఉందని బీజేపీ నేత రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాగస్వామ్య పార్టీలు తమకు మరిన్ని లోక్ సభ సీట్లను కావాలని డిమాండ్ చేస్తుండటంపై ఆయన స్పందించారు.
"కూటమిలో రాజకీయాలన్నీ సీట్ల సర్దుబాటు గురించే. సర్దుబాటు కోసం మేమూ సిద్ధంగా ఉన్నాము. కుష్వాహ వంటి చిన్న పార్టీల నేతలు మమ్మల్ని వీడాలని నిర్ణయించుకోవచ్చు. ఇదే సమయంలో మేము కొత్త పార్టీలను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా దక్షిణాదిలో, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో కొత్త పార్టీలు వచ్చి చేరుతాయి" అని అన్నారు.
లోక్ సభ ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు, మెహబూబా ముఫ్తీ, ఉపేంద్ర కుష్వాహ వంటి నేతలు వెళ్లడంతో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసే పనిలో బీజేపీ అగ్ర నాయకత్వం తలమునకలై ఉంది. గత వారంలో రామ్ విలాస్ పాశ్వాన్ తో చర్చల అనంతరం బీహార్ సీట్ల పంపిణీపై ఓ అవగాహన కూడా కుదుర్చుకుంది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని అప్నాదళ్, ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ, రాష్ట్రంలో జరిగే ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనూ తాము పాల్గొనబోమని అల్టిమేట్టం ఇచ్చింది.
కాగా, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీతో చేతులు కలుపుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి రానున్న రజనీకాంత్ సైతం బీజేపీ గొడుగు కిందకే వెళ్తారన్న వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న వేళ, బీజేపీ 'బీ టీమ్' కేసీఆరేనని కాంగ్రెస్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్, బీజేపీలతో సమాన దూరం పాటిస్తున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం అవసరమైన పక్షంలో బీజేపీకి షరతులతో కూడిన మద్దతు ప్రకటిస్తానన్న సంకేతాలు ఇచ్చారు.