Donald Trump: క్రిస్మస్ నాటి రాత్రి... ఎవరికీ చెప్పకుండా ఇరాక్ వెళ్లిపోయిన ట్రంప్!
- అత్యంత రహస్యంగా సాగిన పర్యటన
- బాగ్దాద్ లో సైనికులతో గడిపిన అమెరికా అధ్యక్షుడు
- వెంట భార్య మెలానియా ట్రంప్ కూడా
క్రిస్మస్ పర్వదినం నాటి రాత్రి ఇరాక్ లో పనిచేస్తున్న అమెరికన్ సైనికులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వారిముందు ప్రత్యక్షమయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, అత్యంత రహస్యంగా ఈ పర్యటన సాగింది.
ఇరాక్ లో అమెరికన్ సైనికుల త్యాగాలకు, వారు అందించిన సేవలకు అభినందనలు తెలిపేందుకు ట్రంప్ ఇరాక్ కు వెళ్లారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. తన ఇరాక్ పర్యటన సందర్భంగా సైనికులను కలిసి వారితో వేడుకలు జరుపుకున్న ట్రంప్, ఇరాక్ కేంద్రంగా సిరియాలో ఆపరేషన్స్ కొనసాగుతాయని, ఇక్కడి నుంచి సైనికులను వెనక్కు రప్పించే ఉద్దేశం లేదని అన్నారు. ట్రంప్ ఇరాక్ లో పర్యటించడం ఇదే తొలిసారి.
బాగ్దాద్ పశ్చిమ ప్రాంతంలోని అల్ అసద్ ఎయిర్ బేస్ లో ట్రంప్, ఆయన భార్య మెలానియా, అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ లు వున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ల్యాండ్ అయింది. అదే ఎయిర్ బేస్ లోని రెస్టారెంట్ లో సైనికులతో సమావేశమైన ట్రంప్ మూడు గంటల పాటు అక్కడే గడిపారు. చాలామంది సైనికులు సెల్ఫీలు అడుగుతుంటే, ట్రంప్, మెలానియాలు నవ్వుతూ ఫొటోలు దిగారు.