CM Ramesh: 'ఉక్కు' సంకల్పం.. నేడు గడ్డం తీయనున్న సీఎం రమేశ్!
- కడప ఉక్కు కోసం గతంలో రమేశ్ నిరాహార దీక్ష
- పునాది రాయి పడే వరకు గడ్డం తీయబోనని ప్రతిన
- నేడు తిరుమలలో దీక్ష విరమణ
‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్’ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుండడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నేడు తన దీక్షను విరమించనున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి పునాది రాయి పడే వరకు గడ్డం తీయబోనని రమేశ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎం.కంబాలదిన్నెలో పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పునాదిరాయి కార్యక్రమం పూర్తయిన వెంటనే సీఎం రమేశ్ తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం గడ్డం తీసి తలనీలాలు సమర్పించనున్నారు.
విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి పేర్కొన్నప్పటికీ కేంద్రం ఆ విషయంలో ముందుకు రాకపోవడంతో పార్టీలకు అతీతంగా ఆందోళనలు జరిగాయి. కేంద్రానికి వ్యతిరేకంగా వివిధ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. కడపలో ఉక్కుపరిశ్రమ నిర్మించాలంటూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ సందర్భంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పునాది రాయిపడే వరకు గడ్డం తీయనని దీక్ష పూనారు. నేడు సీఎం చంద్రబాబు పునాది రాయి వేయనుండడంతో రమేశ్ తన దీక్షను విరమించనున్నారు.