Andhra Pradesh: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశా.. ఆక్వాలో ఏపీ అగ్రస్థానంలో ఉంది!: చంద్రబాబు
- రైతుల ఆదాయం 97 శాతం పెరిగింది
- ఉద్యానవన పంటల్లో రెండో స్థానంలో ఉన్నాం
- వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాం
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ చెబుతున్నారనీ, కానీ ఏపీలో గత నాలుగేళ్లలోనే దాన్ని సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతుల ఆదాయాన్ని గత నాలుగేళ్లలో ఏకంగా 97 శాతం పెంచామన్నారు. ఏపీకి దరిదాపుల్లో కూడా మరో రాష్ట్రం లేదని వెల్లడించారు. ఉద్యానవన పంటల్లో రెండో స్థానం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంలో మూడో స్థానం, ఆక్వా కల్చర్ లో అగ్రస్థానంలోనూ ఏపీ నిలిచిందని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమయిందని వ్యాఖ్యానించారు. ఏపీ వ్యవసాయ రంగంపై చంద్రబాబు ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా కృషి చేశామని తెలిపారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్ లో రైతన్నల ఆదాయంలో వృద్ధి రెండంకెలకు చేరుకుందని చెప్పారు. కర్ణాటక తరహాలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తెచ్చామన్నారు.