Ramdev Baba: 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఊహించలేను: రామ్ దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు!
- విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయలేను
- దేశంలో రాజకీయంగా ఎంతో అనిశ్చితి
- పోటీ చాలా బలంగా ఉండనుందన్న రామ్ దేవ్ బాబా
2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అంచనా వేసే పరిస్థితి లేదని యోగా గురు బాబా రామ్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయంగా ఎంతో అనిశ్చితి నెలకొని వుందని, బీజేపీ గెలుస్తుందా? కాంగ్రెస్ గెలుస్తుందా? అని చెప్పలేకపోతున్నానని ఆయన అన్నారు. యూపీఏ, ఎన్డీయేలు సర్వ శక్తులనూ ఒడ్డి పోరాడనున్నాయని మాత్రం చెప్పగలనని అన్నారు. తమిళనాడు, మధురైని సందర్శించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా ఏ పార్టీకీ మద్దతివ్వబోనని, వ్యతిరేకించబోనని అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి, నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం, మూడు చోట్ల బీజేపీ అధికారానికి దూరమైన రెండు వారాల తరువాత రామ్ దేవ్ బాబా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనకు రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఆలోచన లేదని కూడా ఆయన అన్నారు. యోగా, వేదాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడంపైనే తన దృష్టి ఉందని చెప్పారు. కాగా, 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపును కాంక్షిస్తూ, రామ్ దేవ్ బాబా దేశవ్యాప్త ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపై ఎన్డీయే అధికారంలోకి రాగానే, రామ్ దేవ్ ను హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ, క్యాబినెట్ ర్యాంకును కూడా ప్రకటించారు.