swarupanandendra saraswathi: అర్చకత్వాన్ని సర్వనాశనం చేయాలని ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి: స్వరూపానందేంద్ర సరస్వతి
- హైకోర్టు చాలా గొప్పగా తీర్పు ఇచ్చింది
- బ్రాహ్మణులకు అర్చక వృత్తి ప్రధానం
- దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ నిర్ణయాలు ఘోరం
దేవాదాయ ధర్మాదాయ శాఖకు గానీ, టీటీడీ వ్యవస్థకు గానీ అర్చకుల జోలికొచ్చే హక్కు లేదని శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తిరుమలలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అర్చకత్వమనేది ఒక వృత్తి అని, క్షురకులకు, రజకులకు వారి వారి వృత్తి పనులు ఎలాగో, బ్రాహ్మణులకు అర్చక వృత్తి ప్రధానమని అన్నారు. అర్చక వృత్తిలో తలదూర్చి వాళ్లకు కూడా పదవీ విరమణ వయసు ఉండాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ నిర్ణయాలు తీసుకోవడం దారుణమని అన్నారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ చేసిన తప్పులకు హైకోర్టు చాలా గొప్పగా తీర్పు నిచ్చిందని, సుప్రీంకోర్టు కూడా అదే విధమైన తీర్పునిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. అర్చకత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని, ఆ వృత్తి లేకపోతే, దేవాలయాలు ఎలా ఉంటాయి? అని ప్రశ్నించారు. అర్చకులకు, భక్తులకు సంబంధముండే దేవాలయాల్లో ప్రభుత్వాలకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. 'అసలు అర్చకులకు పదవీ విరమణ ఏంటీ? ఇదేమైనా ప్రభుత్వ ఉద్యోగం లాంటిదా? ఇదొక వృత్తి' అని వివరించారు. అర్చకుల కోసం శారదాపీఠం పోరాడుతుందని, వెంకన్న దయవల్ల అర్చకులకు మేలు జరగాలని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర అన్నారు.