naresh: జంధ్యాల గారు గోదావరిలో దూకేయమన్నారు .. దూకేశానంతే: సీనియర్ నరేశ్
- అది 'పుత్తడి బొమ్మ' షూటింగ్
- గోదావరి ఉద్ధృతంగా వుంది
- 'హెల్ప్'అని అరవడంతో ట్యూబ్ విసిరారు
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నరేశ్ మాట్లాడుతూ, జంధ్యాలగారిపట్ల తనకి గల నమ్మకాన్ని గురించి .. ఆయనతో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. "ఒక దర్శకుడిగా జంధ్యాల గారు ఏం చెబితే అది చేసేవాడిని. నరేశ్ కి ఏదైనా అయితే వాళ్లమ్మ చంపేస్తుందని నిర్మాతలు భయపడేవారు.
అలాగే 'పుత్తడి బొమ్మ' సినిమా కోసం ఆయన గోదావరిలో దూకమన్నారు. గోదావరి ఉద్ధృతంగానే వుంది. హీరోయిన్ పడవెక్కేసి వెళ్లిపోతుంటే, ఆ అమ్మాయిని తీసుకురావడం కోసం గోదావరిలోకి దూకి .. ఈత కొడుతూ ఆమె పడవను చేరుకోవాలి .. అదీ సీన్. నేను కొంతదూరం ఈత కొడుతూ వెళ్లాక 'హెల్ప్' అని అరిచాను. వెంటనే యూనిట్ వాళ్లు ఒక ట్యూబ్ విసిరారు. నేను హెల్ప్ అని అరిచిన దానిని డబ్బింగ్ లో 'అమ్మాయి గారు' అనే డైలాగ్ గా మార్చడం నా జీవితంలో మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.