Paidikondala Manikyalarao: ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా!
- ఎన్నికలకు ముందు కూటమి తరఫున హామీలు
- 56 హామీలను నెరవేర్చలేకపోయాను
- అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబు
- 16 రోజులు వేచిచూసి, ఆపై నిరాహార దీక్ష చేస్తానన్న పైడికొండల
తన ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని, ఆ కారణంతోనే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తాను 56 హామీలను ఇచ్చానని, పొత్తులో భాగంగా వాటిని నెరవేరుస్తానని చెప్పిన చంద్రబాబు సర్కారు, ఆపై అభివృద్ధిపై శీతకన్నేసిందని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీడీపీ విఫలమైందని అన్నారు.
15 రోజుల్లోగా హామీల అమలుకు చంద్రబాబు కార్యాచరణను ప్రకటించకుంటే, నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ నేతల ఒత్తిడి కారణంగానే తన నియోజకవర్గ పనులను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని మాణిక్యాలరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ ఉనికే లేదని, అందువల్ల కూడా ఇక్కడ అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. ఇలాంటి అసెంబ్లీలో ఉన్నందుకు తాను సిగ్గుపడుతున్నానని, తన రాజీనామాను ఆమోదించైనా, హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు.