Prayas Roy Barman: కోహ్లీతో సెల్ఫీ దిగాలని కలలుకన్నాడు... ఇప్పుడు అతనితోనే కలిసి ఆడుతున్నాడు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-59980fce6132a3668073982d485696f6a0068a6a.jpg)
- రూ. 1.50 కోట్లు పలికిన ప్రయాస్
- కొనుగోలు చేసిన ఆర్సీబీ
- కోహ్లీతో డ్రస్సింగ్ రూమ్ పంచుకునే చాన్స్
ప్రయాస్ రాయ్ బర్మాన్... భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఓ సెల్ఫీ దిగాలన్నది అతని చిరకాల కోరిక. గతంలో ఎన్నోమార్లు ప్రయత్నించి విఫలమైన యువ క్రికెటర్. అయితే, ఇప్పుడు అతనికి అంతకుమించిన అవకాశం తలుపుతట్టింది. 16 ఏళ్ల వయసులోనే కనీసధరకు 7 రెట్లకు పైగా ఆఫర్ చేస్తూ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతన్ని కొనుగోలు చేసింది. దీంతో ప్రయాస్ రాయ్, ఇప్పుడు కొన్ని రోజులపాటు విరాట్ కోహ్లీతో డ్రస్సింగ్ రూమ్ ను, అవకాశం వస్తే, అతనితో మైదానాన్ని పంచుకోనున్నాడు. కోహ్లీని కలుస్తానన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ప్రయాస్, విరాట్ తనకు రోల్ మోడలని, తన హీరోతో కలిసివుండే అవకాశం కలగడాన్ని నమ్మలేకున్నానని అంటున్నాడు.