Mancherial District: మంచిర్యాల పరువు హత్య: బయటకొచ్చిన అనురాధ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

  • తల్లిదండ్రుల నుంచి హాని తప్పదని ముందే ఊహించిన అనురాధ
  • సెల్ఫీ వీడియోలో అన్ని వివరాలు వెల్లడించిన వైనం
  • వీడియో ఆధారంగా చర్యలు తీసుకోవాలని వేడుకోలు

మంచిర్యాల పరువు హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో సొంత తల్లిదండ్రులే కుమార్తెను గొంతు పిసికి చంపేశారు. తల్లిదండ్రుల నుంచి హాని ఉందని ముందే ఊహించిన అనురాధ (22) ఓ సెల్ఫీ వీడియోలో మొత్తం విషయాలను పూసగుచ్చినట్టు వివరించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తన పేరు అనురాధ అని, తమది కలమడుగు అనే గ్రామమని పేర్కొంది. తాను లక్ష్మణ్ అనే వ్యక్తిని ప్రేమించానని, ఆరు నెలల క్రితం ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశానని పేర్కొంది. వారు అంగీకరించకపోగా, తనతో అతడిపై తప్పుడు కేసు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేసింది. అతడిని తాను మర్చిపోలేకపోతున్నానని, అతడితోనే తన జీవితమని పేర్కొంది. ఇంట్లోంచి వెళ్లిపోయి లక్ష్మణ్‌ను పెళ్లి చేసుకుని అతడితో ఉండాలనేదే తన కోరిక అని పేర్కొంది.

ఈ క్రమంలో తాను అతడితో వెళ్లిపోయిన తర్వాత తమకు హాని జరిగితే దానికి తన తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్‌దే పూర్తి బాధ్యత అవుతుందని పేర్కొంది. తమకేమైనా జరిగితే ఈ వీడియో ఆధారంగా తమను రక్షించాలని పోలీసులను అభ్యర్థిస్తున్నానని, తమను కాపాడాలని వేడుకుంది.

కాగా, తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందన్న కోపంతో అనురాధను తల్లిదండ్రులే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తల్లిదండ్రులు, సోదరుడు కలిసి అనురాధపై దాడిచేసి, అనంతరం గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని పెట్రోలు పోసి తగలబెట్టారు. బూడిదను చెరువులో కలిపేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News