Andhra Pradesh: నవ్యాంధ్రకు మరో సంస్థ.. ఫైబర్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు ఆదిత్య బిర్లా గ్రూప్ రెడీ
- ఉండవల్లిలో చంద్రబాబును కలిసిన సంస్థ ప్రతినిధులు
- రూ. 4 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ వీఎస్ఎఫ్ కాంప్లెక్స్
- 3,500 మందికి ఉద్యోగావకాశాలు
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకొచ్చింది. ఉండవల్లిలోని ప్రజా వేదికలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధులు.. విస్కాస్ ఫైబర్ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రూ. 4 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ వీఎస్ఎఫ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
పెల్యులోజ్ అనే పునరుత్పాదక ముడి పదార్థం నుంచి ప్రపంచశ్రేణి ప్రమాణాలతో పర్యావరణ హితమైన నారను ఈ కంపెనీలో తయారు చేయనున్నారు. టెక్స్‌టైల్ రంగంలో అతి పెద్ద సంస్థ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందలకు పైగా సంస్థల్లో చెయిన్ పార్ట్‌నర్లు ఉన్నట్టు ప్రతినిధులు తెలిపారు. అనుమతులు లభిస్తే మొదటి దశను రెండేళ్లలోనే పూర్తి చేస్తామని వివరించారు.