electric vehicles: విద్యుత్ వాహనాల స్పీడ్ చార్జింగ్ బ్యాటరీలు వచ్చేస్తున్నాయి... పావు గంటలో పని పూర్తి
- సరికొత్త బ్యాటరీలను అభివృద్ధి చేసినట్లు చెబుతున్న గెగాడైన్
- లిథియం బ్యాటరీల కంటే మెరుగ్గా పనిచేస్తాయని వెల్లడి
- ధర మాత్రం సాధారణ బ్యాటరీలంతే అని వివరణ
ఒక్క పావు గంటలోనే చార్జింగ్ పూర్తయేందుకు ఉపయుక్తమైన కొత్తరకం బ్యాటరీలను తాము అభివృద్ధి చేసినట్లు ముంబయిలోని గెగాడైన్ ఆనే స్టార్టప్ కంపెనీ చెబుతోంది. లిథియం-అయాన్ బ్యాటరీ కంటే మెరుగ్గా ఇవి పనిచేయడమే ఇందుకు కారణమని సంస్థ పరిశోధకులు తెలియజేస్తున్నారు.
అంతమాత్రాన ధర ఎక్కువేమీ కాదని, సాధారణ బ్యాటరీల మాదిరిగానే ఉంటుందని వివరించారు. ఎలక్ట్రోస్టాటిక్ చార్జ్ స్టోరేజ్, రాపిడ్ కైనటిక్ ఫారడే రియాక్షన్ ప్రక్రియలను ఈ బ్యాటరీల రూపకల్పనకు ఉపయోగించామని, సూపర్ కెపాసిటర్‌లకు ఉండే వేగవంతమైన చార్జి సామర్థ్యం, సంప్రదాయ బ్యాటరీల్లోని హైఎనర్జీ డెన్సిటీ గుణం ఈ కొత్త బ్యాటరీలకు వచ్చేలా చేశామని వారు వివరించారు. 2020 కల్లా ఈ బ్యాటరీలను వాణిజ్యపరంగా సిద్ధం చేస్తామని గెగాడైన్ సీఈఓ వెల్లడించారు.
పర్యావరణ హితం, నిర్వహణ భారం అత్యంత తక్కువైన విద్యుత్ ఇంధన వాహనాలపై ప్రజల్లో మోజున్నా, ఎక్కువ దూరం ప్రయాణించేందుకు సరిపడే చార్జింగ్ అందుబాటులో లేకపోవడం, ఒకసారి చార్జింగ్ పెడితే గంటలపాటు వేచి ఉండాల్సి రావడంతో వాహనాల విక్రయం జోరుగా సాగడం లేదు. స్థానిక అవసరాల కోసం మాత్రమే ఏ కొద్దిమందో వీటిని కొనుగోలు చేస్తున్నారు. గెగాడైన్ పరిశోధకులు చెప్పినట్లు చార్జింగ్ స్పీడప్ అయితే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకుంటాయనడంలో సందేహం లేదు.