Bihar: బీహార్ లో సీట్ల పంపకం పూర్తి చేసిన బీజేపీ.. పాశ్వాన్ కు రాజ్యసభ సీటు!
- కుదిరిన సీట్ల సర్దుబాటు
- బీజేపీ, జేడీయూలకు చెరో 17 సీట్లు
- 6 సీట్లలో పోటీ పడనున్న ఎల్జేపీ
వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. తమకు ఆమోదయోగ్యకరమైన విధంగా, సీట్ల సంఖ్య ఉంటేనే ఎన్డీయేతో కలిసుంటామని స్పష్టం చేసిన ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్, ఆరు సీట్లలో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 40 సీట్లుండగా, బీజేపీ, జేడీయూలు చెరో 17 సీట్లలో, మిగతావాటిల్లో ఎల్జేపీ పోటీ పడనున్నాయి. ఎన్నికలకన్నా ముందుగానే పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించేందుకూ ఎన్డీయే పెద్దలు అంగీకరించారు. పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించనున్నామని అమిత్ షా స్వయంగా మీడియాకు తెలిపారు.
పాశ్వాన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, 2014లో రాష్ట్రంలో 31 సీట్లలో విజయం సాధించామని, ఈ దఫా అంతకుమించి సీట్లు రానున్నాయని అంచనా వేశారు. కాగా, ఎన్డీయే నుంచి ఇటీవల ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పీ బయటకు వచ్చిన తరువాత, ఆ అవకాశాన్ని పాశ్వాన్ సమర్థవంతంగా వినియోగించుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.