kcr: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపించడం సిగ్గుచేటు!: కడియం శ్రీహరి
- ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించడం సిగ్గుచేటు
- కేసీఆర్ ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారు
- రైతుబంధుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేసి టీఆర్ఎస్ గెలిచిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారని అన్నారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో జరగని ట్యాంపరింగ్ తెలంగాణలో మాత్రమే ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని ప్రజలు నమ్మారని తెలిపారు. రైతుబంధు పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు.