Andhra Pradesh: కేంద్రీయ విద్యాలయ అధ్యాపకుల నియామక పరీక్షలో గందరగోళం.. కృష్ణా జిల్లాలో అభ్యర్థుల ఆందోళన!
- సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రశ్నాపత్రాల తారుమారు
- ఆందోళనకు దిగిన టీచర్ అభ్యర్థులు
- బాధితులను సముదాయించిన పోలీసులు
కేంద్రీయ విద్యాలయాల్లో అధ్యాపకుల నియామకం కోసం చేపట్టిన పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. ఈ పరీక్షల నిర్వహణ సందర్భంగా అభ్యర్థులకు ఓ పేపర్ కు బదులుగా మరో పేపర్ ను నిర్వాహకులు అప్పగించడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. చివరికి పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో సమస్య సద్దుమణిగింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని ఉయ్యూరులో ఉన్న విశ్వశాంతి పాఠశాలలో ఈరోజు కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ల పోస్టులకు జరిగింది. ఇందుకు దాదాపు 800 మంది హాజరయ్యారు. అయితే నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఓ ప్రశ్నాపత్రానికి బదులుగా మరో ప్రశ్నాపత్రాన్ని అందించారు. ఈ వ్యవహారంతో కంగుతిన్న అభ్యర్థులు పరీక్షా హాలు బయటకు వచ్చి ఆందోళనకు దిగారు.
తాము ఓ సబ్జెక్టులో పరీక్ష రాసేందుకు వస్తే, మరో సబ్జెక్టు పేపర్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పొరపాటు జరిగిందని అంగీకరించిన అధికారులు.. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. చివరికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నచ్చజెప్పడంతో అభ్యర్థులు శాంతించారు.