Telangana: కారును పట్టుకెళ్లిపోయిన తెలంగాణ పోలీసులు.. తిక్కరేగి విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు!
- భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఘటన
- సరైన పత్రాలు లేవని కారు స్వాధీనం
- పైకొస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక
పోలీసుల వ్యవహారశైలితో విసిగిపోయిన ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఏకంగా హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కేశాడు. చివరికి అధికారులు వచ్చి చాలాసేపు బ్రతిమాలడంతో వెనక్కి తగ్గాడు. తెలంగాణలోని పాల్వంచలో నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన షన్మోహన నరేశ్ బాబు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నరేశ్ ఇటీవల ఓ కారును కొన్నాడు. అయితే ఈ వాహనానికి సరైన పత్రాలు లేవంటూ పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయిన యువకుడు కేటీపీఎస్ ఏడవ ఫేజ్ వద్ద ఉన్న హైటెన్షన్ టవర్ ఎక్కాడు. తన కారును ఇప్పించేవరకూ కిందకు రాననీ, ఎవరైనా పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే విద్యుత్ వైర్లను పట్టుకుంటానని హెచ్చరించాడు.
దీంతో కేటీపీఎస్ ఓఅండ్‌ఎం చీఫ్ ఇంజనీర్ జాటోత్ సమ్మయ్య అక్కడకు చేరుకుని నరేశ్ కు ఫోన్ చేశారు. అసలు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. కారును వీలైనంత త్వరగా వెనక్కు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ అధికారుల హామీతో శాంతించిన నరేశ్ టవర్ నుంచి కిందకు దిగాడు. దీంతో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.