Harish Rao: ప్రజల నమ్మకమే కేసీఆర్‌ విజయం: సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు

  • పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఆయనే అభివృద్ధి చేయగలరన్న విశ్వాసం
  • రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుంచిన ఘనత ఆయనది
  • పంచాయతీ ఎన్నికల్లో ఇదే స్థాయి విజయం సాధించాలని పిలుపు

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథాన నడిపిన కేసీఆర్‌ అంటే ప్రజలకు అత్యంత విశ్వాసమని, ఆయనైతేనే రాష్ట్రాన్ని సుభిక్షం చేయగలరన్న నమ్మకంతోనే గడచిన ఎన్నికల్లో ప్రజలు ఓట్ల వర్షం కురిపించారని పార్టీ సీనియర్‌ నాయకుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచిన హరీష్‌రావు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల నమ్మకమే కేసీఆర్‌ అఖండ విజయమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రతికార్యకర్త అంకితభావంతో పనిచేశారని, తాను లక్షా 18 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందానంటే అది కార్యకర్తల కృషి ఫలితమేనన్నారు.

తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలని తెలిపారు. ఎన్నికల్లో అధిష్ఠానం అప్పగించిన బాధ్యతను తాను కూడా చిత్తశుద్ధితో అమలు చేసి విజయంలో తనవంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తి కనిపించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనవసరమైన పట్టుదలలకు పోకుండా గ్రామస్థులంతా కూర్చుని ఐక్యంగా ఓ వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని, దీనివల్ల డబ్బు, సమయం ఆదా అవుతాయని సూచించారు. గ్రామస్థాయి నుంచి అభివృద్ధి సాధ్యమైనప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు.

Harish Rao
Siddipet District
KCR
  • Loading...

More Telugu News