Andhra Pradesh: ఆంధ్రా ప్రజల పట్ల బీజేపీ కసితో వ్యవహరిస్తోంది.. 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చి మాకు ఇవ్వలేదు!: చంద్రబాబు
- శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం
- రైతులను సాకుగా చూపి నిధులను ఆపేశారని మండిపాటు
- అమరావతికి పూర్తి సాయం చేయలేదని ఆవేదన
గుజరాత్ కంటే ఏపీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్న భయంతోనే బీజేపీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అందుకే 11 రాష్ట్రాలకు ఇచ్చిన హోదాను ఏపీకి రాకుండా అడ్డుకుంటోందని వ్యాఖ్యానించారు. హోదాకు ఒప్పుకోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిందన్నారు. అయితే అది కూడా ఇవ్వకుండా చివరికి మోసం చేశారని దుయ్యబట్టారు. ఏపీ రూ.16,078 కోట్ల లోటు బడ్జెట్ తో సతమతం అవుతుంటే కనీసం సాయం చేయలేదన్నారు. అమరావతిలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు ‘ప్రత్యేకహోదా-విభజన హామీల అమలు’ పై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ సందర్భంగా సాయం చేయాలని కోరగా కేంద్రం కుదరదని ముఖం మీదే చెప్పిందన్నారు. అంతేకాకుండా ‘మీరు రైతులకు ఖర్చు పెట్టారు కాబట్టి, ఇకపై నిధులు ఇవ్వం’ అంటూ వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీకి ఏటా రూ.16,078 కోట్లు రావాల్సి ఉండగా తప్పుడు లెక్కలు వేసి రూ.4,117 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోనూ రూ.137 కోట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రజల పట్ల బీజేపీ అంత కసితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కుంభమేళాకు రూ.1,700 కోట్లు, పటేల్ విగ్రహానికి రూ.3,000 కోట్లు పెట్టిన మోదీ సర్కారు అమరావతికి మాత్రం 1700 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే కేంద్రానికే లాభం చేకూరుతుందని చెప్పారు.