Andhra Pradesh: చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే.. మేం బ్లాక్ పేపర్ విడుదల చేస్తాం!: ఆనం
- కిరణ్ కుమార్ రెడ్డి బాబుకు కోవర్టు
- హిందువుల మనోభావాలను సీఎం దెబ్బతీశారు
- బ్లాక్ పేపర్లపై సమాధానం చెప్పి ఎన్నికలకు రావాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విడుదల చేస్తామని చెబుతున్న శ్వేతపత్రాలన్నీ చిత్తు కాగితాలేనని వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఓటమిపాలు కావడంతో ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్లు ముద్దు అంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారని వ్యాఖ్యానించారు. మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధం అవుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీడీపీ విడుదల చేసే ప్రతి శ్వేతపత్రానికి పోటీగా వైసీపీ బ్లాక్ పేపర్ ను విడుదల చేస్తుందని ఆనం ప్రకటించారు. ఈ బ్లాక్ పేపర్లకు సమాధానం చెప్పే చంద్రబాబు ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో చంద్రబాబు కాంగ్రెస్ లో కోవర్టును తయారుచేసుకున్నారని విమర్శించారు.
కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన ‘లాస్ట్ బాల్’ ఎక్కడికి పోయిందో ఇప్పటివరకూ చెప్పలేదని ఎద్దేవా చేశారు. తిరుపతిని సిలికాన్ సిటీ చేస్తానంటూ చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా, విభజన హామీలు సహా చేపట్టిన అభివృద్ధిపై రోజుకు ఒకటి చొప్పున 10 శ్వేతపత్రాలను విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.