Tollywood: ఇళయరాజాకు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు వెళ్లిన ఆరుగురు నిర్మాతలు!
- రాయల్టీ విషయంలో ముదిరిన వివాదం
- కనీసం 50 శాతం ఇవ్వాలని నిర్మాతల డిమాండ్
- మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు
ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఇళయరాజా తన పాటలకు మొత్తం రాయల్టీని డిమాండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆరుగురు నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. టీవీ ఛానెల్స్ లోను, ఇతర సంగీత కార్యక్రమాలలోనూ తన పాటలు పాడితే తనకు రాయల్టీ ఇవ్వాలంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల లీగల్ నోటీసులు ఇస్తున్నారు. దీనిపైనే ప్రొడ్యూసర్లు పీటీ సెల్వకుమార్, అన్బుసెల్వన్, జపజోన్స్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్ కోర్టుకెక్కారు.
ముందస్తు అనుమతి తీసుకోకుండా తన పాటలను వేదికలపై ఆలపించరాదనీ, అలా చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని ఇళయరాజా గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన పాటలకు ఆయన గత 5 ఏళ్లుగా రాయల్టీ వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాటలపై పూర్తి హక్కు తనకే ఉంటుందని ఇళయరాజా చెప్పడం సరికాదని, ఆయా చిత్రాల హక్కులను కలిగి వున్న నిర్మాతకే పాటలపై కూడా హక్కు ఉంటుందని నిర్మాతలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. సంగీత దర్శకుడు అందుకుంటున్న రాయల్టీలో నిర్మాతకు కనీసం 50 శాతం ఇవ్వాలని కోరారు.