Sivasena: కేంద్ర నిర్ణయం పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటమే!: శివసేన నాయకురాలు మనీషా కాయండే
- ఇది ప్రజల స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే
- పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ వుంది
- ప్రాథమిక హక్కులను హరించడమే అవుతుంది
దేశంలోని ఎవరి కంప్యూటర్లలోని సమాచారాన్నైనా తనిఖీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలోని 10 దర్యాప్తు సంస్థలకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన నాయకురాలు మనీషా కాయండే తీవ్రంగా స్పందించారు.
దర్యాప్తు సంస్థలకు ఈ విధమైన అధికారం ఇవ్వడమంటే ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడమేనని, ఇది వారి స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని అన్నారు. దేశంలోని పౌరులందరికీ భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించిందని, కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. దీనికి బదులు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే ఇంకా బాగుండేదని ఎద్దేవా చేశారు. ఇటువంటి నిఘ దేశానికి అత్యంత ప్రమాదకరమని ఆమె వ్యాఖ్యానించారు.