love: పెళ్లికి నో చెప్పిన ప్రియురాలు.. స్నేహితులతో కలిసి కిరాతకంగా హత్యచేసిన యువకుడు!
- స్నేహితులతో కలిసి అత్యాచారయత్నం
- అనంతరం ముఖంపై యాసిడ్ దాడి
- ప్రాణాలు కోల్పోయిన తమిళనాడు యువతి
ఫేస్ బుక్ లో మొదలయిన ప్రేమ ఓ యువతి ప్రాణాలు తీసింది. తల్లిదండ్రులకు భయపడి మతాంతర వివాహానికి యువతి ఒప్పుకోకపోవడంతో ప్రియుడు కాలయముడిగా మారిపోయాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్ చేసేందుకు యత్నించాడు. అయితే యువతి పెనుగులాడటంతో కత్తితో కిరాతకంగా గొంతు కోసి చంపాడు. అప్పటికీ కోపం చల్లారక పోవడంతో ముఖంపై యాసిడ్ పోసి వికృత ఆనందం పొందాడు. తమిళనాడులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా తెన్‌కలం ప్రాంతానికి చెందిన ఆషికా పర్వీన్ (18) తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. నల్లమ్మాళ్‌పురంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆషికా, స్థానికంగా ఓ కోచింగ్ సంస్థలో కంప్యూటర్ శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన జేసీబీ మెకానిక్ సుందరరాజ్ తో ఆమెకు ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఇది క్రమంగా ప్రేమగా మారడంతో ఇరువురు తరచూ కలుసుకునేవారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను తీవ్రంగా మందలించారు.
అంతేకాకుండా నివాసాన్ని రహమత్ నగర్ అనే ప్రాంతానికి మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆమె ఇంటి వద్దకు వచ్చిన ప్రియుడు యువతిని కలిశాడు. అనంతరం కోచింగ్ సెంటర్ కు వెళుతున్నానని చెప్పిన ఆషికా, యువకుడిని కలుసుకునేందుకు వెళ్లింది. కుమార్తె ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి కంప్యూటర్ సెంటర్ వద్దకు వెళ్లగా, ఆమె ఇంకా రాలేదని అక్కడివారు జవాబిచ్చారు. మరోవైపు ఆషికాను తీసుకుని సుందరరాజ్ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.
అయితే ఇందుకు ఆమె అంగీకరించలేదు. అంతేకాకుండా గతంలో కలిసి దిగిన ఫొటోలను తనకు వెనక్కు ఇచ్చేయాలని కోరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనయిన సుందరరాజ్, తనతో వచ్చిన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారయత్నం చేశాడు. దీన్ని బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో గొంతు కోసే చంపాడు. అక్కడితో కోపం చల్లారక ఆమె ముఖంపై యాసిడ్ కూడా చల్లాడు. ఆ రోజు రాత్రి ఆషికా ఫొటోలను వార్తాఛానళ్లలో చూసిన ఆమె తల్లిదండ్రులు చనిపోయింది తమ కుమార్తేనని గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.