Telangana: కేసీఆర్ అమెరికా కంపెనీతో కలిసి మా అందరిని ఓడించారు!: కొండా సురేఖ సంచలన ఆరోపణలు
- ఈవీఎంలను శాటిలైట్ ద్వారా కనెక్ట్ చేశారు
- నియోజకవర్గాల్లో ఫలితాలను శాసించారు
- కేసీఆర్ హెలికాప్టర్ నే ప్రజలు అడ్డుకున్నారు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి నెలరోజులు గడవకముందే టీఆర్ఎస్ ప్రలోభాలకు తెరలేపిందని కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని మురళీ ముందుగానే నిర్ణయించుకున్నారని సురేఖ వెల్లడించారు. టీఆర్ఎస్ నేతలు షోకాజ్ నోటీసులు ఇస్తామంటూ బెదిరిస్తున్నారనీ, ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పొందిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమి (ప్రజాకూటమి) కేవలం 21 స్థానాలకు పరిమితం కావడం వెనుక భారీ కుట్ర దాగుందని కొండా సురేఖ తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం ఎన్నికలకు ముందే కేసీఆర్ అమెరికాకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఈ కంపెనీ శాటిలైట్ లింక్స్ ద్వారా ఈవీఎంల్లోని ఓట్లను మార్చిందని వెల్లడించారు. ఏయే నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడాలో ముందుగానే ఈవీఎం యంత్రాల్లో ఫీడ్ చేశారని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా టీఆర్ఎస్ గెలిచిందని దుయ్యబట్టారు.
ఒకవేళ ఇలా జరక్కుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలు గెలుస్తామని కేసీఆర్, కేటీఆర్ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. కేటీఆర్ ను ప్రజలు తరిమికొట్టారనీ, కేసీఆర్ హెలికాప్టర్ ను అడ్డుకున్నారనీ, అంతటి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్న టీఆర్ఎస్ గెలిచే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తాము ప్రజల మధ్యే ఉంటామని తెలిపారు. ప్రజాసమస్యలపై గట్టిగా మాట్లాడే రేవంత్ రెడ్డి, డీకే అరుణ, జానారెడ్డితో పాటు తనను పక్కా ప్లాన్ తో, మోసపూరితంగా ఓడించారని విమర్శించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు.