nandamuri balakrishna: ఆధునిక ఆంధ్ర చరిత్ర ఎన్టీఆర్: నందమూరి బాలకృష్ణ
- ఎన్టీఆర్ వారసుడిని కావడం నా పూర్వజన్మ సుకృతం
- వ్యాపారం కోసం ఈ బయోపిక్ తీయలేదు
- ‘ఎన్టీఆర్’ ను ఇతర భాషల్లోకీ డబ్బింగ్ చేస్తాం
ఆధునిక ఆంధ్ర చరిత్ర తన తండ్రి ఎన్టీఆర్ అని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం ‘కథానాయకుడు’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ వారసుడిని కావడం తన పూర్వజన్మ సుకృతమని, చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరిగి రాయాలన్నా తామేనని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని మొదట నిమ్మకూరులో నిర్వహిద్దామనుకున్నామనీ, కానీ, వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ బయోపిక్ ను సకుటుంబ సమేతంగా చూడాలని, ఈ దీనిని ఇతర భాషల్లోకీ డబ్బింగ్ చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్ ని వ్యాపారం కోసం తీయలేదని, ఈ బయోపిక్ తీయాలని రాసిపెట్టి ఉంది కాబట్టే తీశానని, ఎన్టీఆర్ ని బాలకృష్ణ ఆలోచనలో ఎలా ఉంటారో దర్శకుడు క్రిష్ చూపించారని అన్నారు.
ఈ బయోపిక్ రెండు భాగాలు పూర్తయ్యాయని, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ఈ బయోపిక్ లో తన తల్లి పాత్రను పోషించిన విద్యాబాలన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం ద్వారా తన తల్లి రుణం తీర్చుకున్నానని, ‘ఎన్టీఆర్’ బయోపిక్ ద్వారా తండ్రి రుణం కూడా తీర్చుకున్నట్టయిందని బాలకృష్ణ అన్నారు.