Andhra Pradesh: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం!
- ఉండవల్లిలో టీడీపీ సమన్వయకమిటీ భేటీ
- నేతల పనితీరును సమీక్షించిన చంద్రబాబు
- నేతల పట్ల కఠినంగా ఉంటానని వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం వహించిన టీడీపీ నేతలకు చంద్రబాబు తలంటారు. ప్రజలకు సేవ చేసుకుని మెప్పు పొందాలనీ, పార్టీని మోసం చేయవద్దని హితవు పలికారు. గట్టిగా తిడితే ప్రజల్లో చులకన అవుతారన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు ఊరుకున్నానని వ్యాఖ్యానించారు. తిట్టకపోతే మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే ఆరు నెలలు తాను కఠినంగా ఉంటాననీ, నేతలందరూ ఎమర్జెన్సీ తరహాలో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాలు టీడీపీ సభ్యత్వ నమోదులో మొదటి మూడు స్థానాల్లో ఉండగా, నెల్లూరు గ్రామీణం, పీలేరు నియోజకవర్గాల్లో అత్యల్పంగా నమోదయింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నేత, మంత్రి అచ్చెన్నాయుడు ఈ భేటీకి రాకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. జిల్లాలో జరిగిన గ్రామ వికాసం కార్యక్రమంలో సైతం మంత్రి సరిగ్గా పాల్గొనడం లేదని వ్యాఖ్యానించారు.