Telangana: కాంగ్రెస్ ను విలీనం చేయాలని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే!: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- ఆ నలుగురు సీఎల్పీలో సభ్యులు కారు
- విలీనం చేయాలని వాళ్లు చెప్పడం ఏంటి?
- చైర్మన్ స్వామిగౌడ్ ను కలిసిన ఉత్తమ్, షబ్బీర్
తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ఆకుల లలిత, సంతోష్ కుమార్, దామోదర్, ప్రభాకర్ ఈరోజు మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ప్రస్తుతం చాలా వికారమైన ధోరణి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు ప్రభాకర్, దామోదర్ రెడ్డి గతంలోనే టీఆర్ఎస్ లో చేరారని ఉత్తమ్ తెలిపారు. అసలు కాంగ్రెస్ పార్టీలోనే లేనివారు సీఎల్పీ సమావేశం పెట్టి విలీనం చేయాలని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ ను కలుసుకున్న అనంతరం మండలి విపక్ష నేత షబ్బీర్ అలీతో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.
ఆకుల లలిత, సంతోష్ కుమార్ తెలంగాణ సీఎల్పీలో సభ్యులు కారనీ, వీళ్లకు సీఎల్పీ సమావేశం ఏర్పాటుచేసే అధికారం లేదని ఉత్తమ్ తెలిపారు. ఈ వ్యవహారంలో స్వామిగౌడ్ కు లేఖ ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి విలీనం సాధ్యం కాదనీ, నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. కొందరు వ్యక్తులకు లొంగిపోకుండా వ్యవస్థలను కాపాడాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్ ను కోరినట్లు కాంగ్రెస్ మండలి పక్షనేత షబ్బీర్ అలీ తెలిపారు. సీఎల్పీ అనుమతి లేకుండా పార్టీ శాసనమండలి సమావేశం జరగడానికి వీలు లేదన్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.