Telangana: పుట్టింటి నుంచి రానన్న భార్య.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న టెక్కీ!
- హైదరాబాద్ లో ఘటన
- భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు
- కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
చిన్నపాటి గొడవతో భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, కుమారుడిని కలుసుకోకుండా అడ్డుకోవడంతో మనస్తాపానికి లోనయిన ఓ టెక్కీ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నగరంలోని జియాగూడ క్రాంతిభవన్‌లో ఉంటున్న జి.కమలేశ్(40) బహుళజాతి కంపెనీ ఐబీఎంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కమలేశ్ కు శ్రీవిద్యతో వివాహం అయింది. ఈ దంపతులకు పదేళ్ల బాబు ఉన్నాడు.
ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం కమలేశ్, శ్రీవిద్య మధ్య గొడవలు జరిగాయి. దీంతో కుమారుడిని తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కొడుకు, భార్యపై బెంగ పెట్టుకున్న కమలేశ్, నాలుగు రోజుల క్రితం శ్రీవిద్యకు ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చేయాలనీ, ఇకపై గొడవ పడనని చెప్పాడు. అయితే శ్రీవిద్య ఇందుకు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి లోనయిన కమలేశ్ ఇంట్లో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు.
ఈ క్రమంలో నాలుగు రోజులుగా న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు ఇంటి ముందు పేరుకుపోవడంతో స్థానికులు ఇంటి తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. ఇంట్లో విగతజీవిగా వేలాడుతున్న కమలేశ్ ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.