IRCTC: ఐఆర్సీటీసీ హోటళ్ల కుంభకోణం కేసుల్లో లాలూకు ఊరట
- లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పటి కుంభకోణం
- రెండు హోటళ్ల కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవినీతి
- లాలూకు జనవరి 19 వరకు మధ్యంతర బెయిల్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన రెండు కేసుల్లో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. ఐఆర్సీటీసీకి చెందిన రెండు హోటళ్ల కాంట్రాక్టులను ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించడంలో అవినీతికి పాల్పడ్డట్లు నాడు ఆరోపణలు తలెత్తాయి.
ఈ కేసుల్లో లాలూ, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ ఇంకొందరిపైనా దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. ఈ కేసులకు సంబంధించిన విచారణను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఈరోజు నిర్వహించింది. ఈ సందర్భంగా లాలూకు జనవరి 19 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తూ ప్రస్తుతం రాంచీ జైలులో ఉన్న లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో, ఈ కేసుల్లో విచారణకు ఆయన నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.