Jagan: జగన్ కోసం రెండు కిలోమీటర్లు ఏడుస్తూ పరిగెత్తుకొచ్చిన పాప... పాదయాత్రను ఆపి మరీ ఓదార్చిన వైసీపీ అధినేత!

  • జగన్ ను చూడాలని రెండు కిలోమీటర్లు పరిగెత్తిన లలిత
  • జగన్ ను చూడగానే భావోద్వేగంతో ఏడుపు
  • పాపను దగ్గరకు తీసుకుని ఓదార్చిన జగన్

జగనన్న తన ఊరికి వచ్చాడని తెలుసుకున్న ఆ బాలిక, అన్న దగ్గరికి తీసుకెళ్లాలని కోరితే, తల్లిదండ్రులు కుదరదని చెప్పడంతో, ఆ పాప రెండు కిలోమీటర్ల పాటు పరిగెత్తి, సెక్యూరిటీని దాటుకుని జగన్ ను చేరుకున్న వేళ, జగన్ సైతం కొంతసేపు భావోద్వేగానికి లోనై, ఆ పాపను అక్కన చేర్చుకుని ఓదార్చారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని కొత్తపేట క్రాస్ వద్ద జరిగింది.

జర్దంగి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న పేడాడ లలిత, జగన్ ను చూడాలన్న పట్టుదలతో గుంజిలోవ నుంచి పాదయాత్రను అనుసరించింది. అర కిలోమీటర్ నడిచినా జగన్ ను చేరుకోలేకపోయిన ఆమె, పరుగెత్తుతూ వచ్చింది. సెక్యూరిటీని దాటి వచ్చిన ఆమె, జగన్ ను చూసి బోరున విలపించింది.

ఏం జరిగిందో అర్థంకాని జగన్, లలితను దగ్గరకు తీసుకుని "ఏమైంది తల్లీ.. ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడగటంతో ఆ పాప మరింతగా ఏడ్చింది. గుక్కపెడుతూ జగన్ ను గట్టిగా పట్టేసుకుంది. దీంతో చలించిపోయిన జగన్, ఆమెను సముదాయిస్తూ, ఊరడించారు. నిన్ను చూస్తానని అమ్మానాన్నతో పందం కట్టానని, రెండు కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏడుపు వచ్చిందని పాప చెప్పడంతో, ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్న జగన్ ఆమెను ఓదార్చారు.

కాలు నొప్పిగా ఉందా? అని అడుగుతూ, ఆమె చెప్పులు తెగిపోయి ఉండటాన్ని చూసి జగన్ కూడా కాసేపు అక్కడే ఉండి, పాప తేరుకునేంత వరకూ ఆమెను పొదివి పట్టుకునే నిలబడిపోయారు. ఆపై పాప వివరాలు అడిగి తెలుసుకుని, తానున్నానని, బాగా చదువుకోవాలని చెప్పి, పాపను క్షేమంగా ఇల్లు చేర్చాలని తన అనుచరులకు చెప్పి పంపారు.

Jagan
Padayatra
Lalita
Srikakulam District
Tekkali
  • Loading...

More Telugu News