Pakistani journalis: దేశంలో గాడిదల సంఖ్య పెరిగిపోతోందంటూ గాడిదపై కూర్చుని రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్!
- వెరైటీగా ఇంటర్వ్యూలు చేసే పాక్ జర్నలిస్ట్ అమీన్
- అతడి ఇంటర్వ్యూలు ప్రపంచవ్యాప్తంగా వైరల్
- అంతేస్థాయిలో విమర్శలు
అసాధారణ శైలి రిపోర్టింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్న పాకిస్థాన్ జియో న్యూస్ చానల్ జర్నలిస్టు అమీన్ హఫీజ్ (32) ఈసారి గాడిదపై సవారీ చేశాడు. పాకిస్థాన్‌లో గాడిదల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఈ అంశంపై అమీన్ రిపోర్టింగ్ చేశాడు. లాహోర్‌లోని గాడిదల ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడున్న గాడిదల యజమానులను ఇంటర్వ్యూ చేశాడు. గాడిదపై కూర్చుని వారిని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. చివర్లో గాడిద కదలడంతో అమీన్ దానిపై నుంచి కింద పడ్డాడు.
అమీన్ ఇలా ఇంటర్వ్యూలు చేయడం ఇదే కొత్తకాదు. గతంలో పాదచారుల వంతెన పైకెక్కిన ఓ గెదెను ఇంటర్వ్యూ చేయడం అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. దాని మూతి వద్ద మైక్ పెట్టి వంతెన ఎక్కిన తర్వాత నీ అనుభవం ఏంటి? అని ప్రశ్నించాడు. మరో సందర్భంగా ఓ మేకను ఇంటర్వ్యూ చేస్తూ ‘నీకు ఇంగ్లిష్ వచ్చా?’ అని ప్రశ్నించాడు. 2002లో ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రవేశించిన అమీన్ తన రిపోర్టింగ్‌తో వైరల్ అవడమే కాదు.. అంతకుమించి విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు.