Mumbai: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఫుడ్ డెలివరీకి వచ్చి పదిమంది ప్రాణాలను కాపాడిన డెలివరీ బాయ్
- రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
- 8 మంది మృతి.. పలువురికి గాయాలు
- విధులను పక్కనపెట్టి సహాయక చర్యల్లో పాల్గొన్న ‘స్విగ్గీ బాయ్’
ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అప్రమత్తత పదిమంది ప్రాణాలను కాపాడింది. స్విగ్గీ ఫుడ్ డెలివరీకి వచ్చిన సిద్ధు హుమనబాదె (20) ఆసుపత్రి భవనం మంటల్లో చిక్కుకోవడాన్ని గమనించి వెంటనే అప్రమత్తమయ్యాడు. విధులను కాసేపు పక్కనపెట్టి అక్కడి సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. మూడు గంటలపాటు సహాయక చర్యల్లో పాల్గొన్న సిద్ధు పదిమందిని కాపాడాడు.
సోమవారం ముంబైలోని ఈస్ట్ అంధేరీలోని మరోల్ ఈఎస్ఐసీ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి మంటల్లో చిక్కుకున్న సమయంలో ఆ ప్రాంతం గుండా వెళ్తున్న సిద్ధు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రి వద్ద ఉన్న నిచ్చెన ఎక్కి మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించాడు. సహాయక సిబ్బందితో కలిసి పదిమంది ప్రాణాలు కాపాడాడు. రాళ్లు తీసుకుని నిచ్చెన ద్వారా పైకి ఎక్కిన సిద్ధు అద్దాలను బద్దలుగొట్టి మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి బయటకు తీసుకొచ్చాడు.
అయితే, మంటల కారణంగా భవనంలో పొగకమ్ముకోవడంతో దానిని పీల్చిన సిద్ధు అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పొగ లోపలికి వెళ్లకుండా ముక్కుకు రుమాలు కట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని సిద్ధు తెలిపాడు. ఆసుపత్రిలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నంలో ముగ్గురు పట్టుతప్పి కిందపడిపోయారని, ఆ సమయంలో తానేమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. సిద్ధుకు ఇటువంటి పనులు కొత్తకాదని, ఆపద ఎక్కడున్నా అక్కడ వాలిపోవడం అతనికి అలవాటేనని అతడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. తన ప్రాణాలకు తెగించి పదిమందిని కాపాడిన సిద్ధుపై ప్రశంసలు కురుస్తున్నాయి.