amaravathi: ఏపీలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు రావచ్చు: మంత్రి లోకేశ్
- కనీసం 250 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలి
- పరిశ్రమ ఏర్పాటుకు ఏడాది తర్వాత భూములిస్తాం
- ఆరు ఐటీ కంపెనీలను ప్రారంభించడం సంతోషంగా ఉంది
ఏపీలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఎవరైనా ముందుకొచ్చి, కనీసం 250 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తే వారికి ఏడాది తర్వాత భూములిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇన్ఫో సైట్ భవనంలో 6 ఐటీ కంపెనీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఆరు ఐటీ కంపెనీలను ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి చెందిన ఐటీ నిపుణులు ఉన్నారని, అందులో ఎక్కువ మంది మన రాష్ట్రానికి చెందినవారేనని అన్నారు. నవ్యాంధ్రలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపించామని చెప్పిన లోకేశ్, ఐటీ రంగం ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ 34 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, హెచ్ సీ ఎల్, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, జోహా లాంటి అనేక పెద్ద ఐటీ కంపెనీలు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీలో ఐటీ అభివృద్ధికి పెద్ద పెద్ద సంస్థలు ఎంత ముఖ్యమో చిన్న, మధ్యతరగతి కంపెనీలు కూడా అంతే ముఖ్యమని, లక్ష ఐటీ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఒక వైపు సంస్థలను తీసుకు వస్తూనే, మరోవైపు యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్టు చెప్పారు.