gslv-f 11: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్11 ప్రయోగం విజయవంతమైంది: ఇస్రో చైర్మన్ శివన్
- నెల రోజుల వ్యవధిలో మూడో ప్రయోగమిది
- ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లింది
- ఈ ఉపగ్రహంలో అధునాతన సాంకేతికత ఉపయోగించాం
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్11 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ శివన్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలను శివన్ అభినందించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, శ్రీహరికోట నుంచి 35 రోజుల వ్యవధిలో మూడో ప్రయోగం నిర్వహించామని అన్నారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్ వీ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహంలో అధునాతన సాంకేతికత ఉపయోగించామని చెప్పారు. వారం రోజుల క్రితం వాతావరణ పరిస్థితులు సరిగా లేవని, మెట్ బృందం సమన్వయంతో ఈ ప్రయోగం విజయవంతమైందని అన్నారు.
కాగా, జీశాట్-7ఏ ఉపగ్రహం ద్వారా భారత వాయుసేనకు 70 శాతం, సైన్యానికి 30 శాతం ఉపయుక్తం కానుంది. జీశాట్-ఏతో వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు వచ్చినట్టయింది. కేయూ బ్యాండ్ ద్వారా రాడార్ల కంటే శక్తిమంతమైన సిగ్నళ్లను జీశాట్-7 ఏ అందించనుంది. ప్రధానంగా విమానాలకు ఈ సిగ్నల్స్ ఉపకరించనున్నాయి.