sabarimala: శబరిమలపై బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన ఒవైసీ!
- మహిళలపై నిషేధం లింగ వివక్ష కాదన్న బీజేపీ చీఫ్
- షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన ఒవైసీ
- ట్రిపుల్ తలాక్ పై వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ ఎద్దేవా
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం లింగ వివక్ష కాదనీ, అది విశ్వాసాలకు సంబంధించిన అంశమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించడంపై మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. శబరిమల మత విశ్వాసాలకు సంబంధించిన విషయమని చెబుతున్న అమిత్ షా ట్రిపుల్ తలాక్ విషయంలో జోక్యం చేసుకోవడాన్ని మహిళలకు న్యాయం చేయడంగా, లైంగిక సమానత్వంగా అభివర్ణిస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ తరహా లాజిక్కులు అమిత్ షా మాత్రమే చేయగలరని ఎద్దేవా చేశారు. బాల్య వివాహాలు, కట్నం తీసుకోవడం వంటి దురాచారాలు ప్రభుత్వం చేసిన చట్టాల కారణంగానే తగ్గిపోయాయని షా భావిస్తుంటే, ఓసారి ఎన్ఎస్ఎస్ వో, ఎన్ఎఫ్ హెచ్ఎస్ డేటాను పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. శబరిమల ప్రజల నమ్మకానికి సంబంధించిన విషయమనీ, కొన్నికొన్ని విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవని ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో షా తెలిపారు. ఇలాంటి మత సంబంధమైన విషయాల్లో తుది నిర్ణయాన్ని ప్రజలకు వదిలిపెట్టేయాలని కోరారు.
శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఇటీవలి కాలం వరకూ నిషేధం కొనసాగింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. మహిళలపై కొనసాగుతున్న నిషేధాన్నికొట్టివేస్తూ 2-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది.