Amit Shah: మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం మాకే కాదు, దేశానికీ అవసరమే!: పార్టీ చీఫ్ అమిత్‌షా
- అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉండదు
- రాష్ట్రాల ఎన్నికల్లో వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయి
- 16 రాష్ట్రాల్లో అధికారంతో దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉంది
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడం అత్యంత అవసరమని, ఇది పార్టీకే కాదు దేశానికి కూడా ఎంతో ముఖ్యమని పార్టీ చీఫ్ అమిత్‌షా అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాని విషయం వాస్తవమే అయినా, 2019లో లోక్‌సభకు జరిగే ఎన్నికలతో వీటిని ముడిపెట్టడం సరికాదని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు అంశాలు, స్థానిక సమస్యలు ప్రభావం చూపుతాయని చెప్పారు. 2014లో కేవలం ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 16 రాష్ట్రాలకు విస్తరించడాన్ని గుర్తు చేశారు. దీన్నిబట్టే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అంచనా వేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలన్నీ ‘మహాకూటమి’ పేరుతో జట్టుకడుతున్నా, ఆ కూటమి ఎన్నాళ్లో నిలవదని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేస్తామని, ఇప్పటికే ఆ పార్టీతో ఈ దిశగా చర్చలు జరుపుతున్నామని తెలిపారు.