Andhra Pradesh: వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్!
- పార్టీలో చేరిన బమ్మిడి నారాయణస్వామి
- వైఎస్ రైతు బాంధవుడని ప్రశంస
- జగన్ ఆయన బాటలోనే వెళుతున్నారని కితాబు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి వైసీపీలో చేరారు. టెక్కలిలో ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడనీ, రైతన్నల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. వైఎస్ జగన్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని అన్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని జోస్యం చెప్పారు.
అప్పట్లో ఎన్‌జీ రంగా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జనతా పార్టీ తరఫున తనతోపాటు 62 మంది ఎమ్మెల్యేలుగా నెగ్గారని నారాయణ స్వామి గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత వీరిలో 61 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, తాను మాత్రం విలువలకు కట్టుబడి జనతా పార్టీలోనే ఉండిపోయానన్నారు. నారాయణ స్వామి 1978 నుంచి 1983 వరకు టెక్కలి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆచార్య ఎన్‌జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన్నలకు ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.