Khammam District: పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఖమ్మంలో సత్తాచాటుతాం: మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క

  • అసెంబ్లీ ఎన్నికల  ఫలితాలు రాష్ట్రంలో అప్పుడు ఉండబోవు
  • పార్టీని వీడి ఎవరూ వెళ్లరు
  • నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడుతాం

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురు వేసినట్టే త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లాలో గెలిచి తీరుతామని, లోక్‌సభ స్థానాన్ని దక్కించుకుంటామని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, భాణోతు హరిప్రియతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జిల్లాలో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారరని, ఎటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపవని చెప్పారు. ఎంతో ఆసక్తి రేకెత్తించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు భిన్నమైన తీర్పునిచ్చి ప్రజాకూటమి పక్షాన నిలబడడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అసెంబ్లీలో వ్యవహరిస్తామని, జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక సమస్యపై దృష్టిసారించి ఆయా రంగాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ మారనున్నారన్న ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచామని, కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు.

Khammam District
Congress
mallubhattivikramarka
  • Loading...

More Telugu News