faith healer: 300 మంది మహిళలపై అత్యాచారం చేసిన ‘దైవాంశ సంభూతుడు’!
- ఫెయిత్ హీలర్‌గా దేశవ్యాప్త గుర్తింపు
- వేలాది మంది భక్తులు
- దోషిగా తేలితే కనీసం పదేళ్ల జైలు శిక్ష
కేన్సర్ సహా పలు రోగాలను చిటికెలో తగ్గిస్తానంటూ పాప్యులర్ అయిన బ్రెజిల్‌కు చెందిన ‘ఫెయిత్ హీలర్’ జావో టీగ్జీరియా డి ఫారియా (76) పోలీసులకు లొంగిపోయాడు. 300 మందికిపైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీగ్జీరియా తనను తాను ‘దైవాంశ సంభూతుడు’గా చెప్పుకుంటాడు. 2013లో ఆయన స్వస్థత విధానాలపై ఓఫ్రా విన్‌ఫ్రే ఓ కార్యక్రమాన్ని ప్రచారం చేసిన తర్వాత సెలెబ్రిటీగా మారిపోయాడు. సెంట్రల్ బ్రెజిల్‌లోని అబడియానియాలోని గొయాస్ అనే గ్రామంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహిస్తున్న టీగ్జీరియా తాజాగా పోలీసులకు లొంగిపోయాడు.
మహిళలపై అతడు చేసిన అకృత్యాలపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో స్పందించిన జడ్జి శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. శనివారం లోగా కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించారు. విషయం తెలిసిన ఫారియా ఆ తర్వాతి రోజే పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఫారియాకు వేలాదిమంది భక్తులు ఉన్నారు. వీరిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్టు ఫారియా తరపు న్యాయవాదులు తెలిపారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారియా నిందితుడిగా తేలితే కనీసం పదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.