Andhra Pradesh: చంద్రబాబే నాకు స్ఫూర్తి.. అందుకే పుట్టినరోజున ఆందోళనకు దిగా!: రామ్మోహన్ నాయుడు
- హోదా వచ్చేవరకూ విశ్రమించబోం
- పుట్టినరోజులు వస్తుంటాయి, పోతుంటాయి
- విభజన హామీలను కేంద్రం అమలుచేయాలి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధించేవరకూ విశ్రమించబోమని టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసమే తాను ఆందోళనకు దిగానని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఆయన పుట్టినరోజు నాడు ధర్మ పోరాట దీక్షలను ప్రారంభించారని గుర్తుచేశారు. చంద్రబాబు స్ఫూర్తితోనే తాను పార్లమెంటులో ఆందోళనకు దిగానని స్పష్టం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఈరోజు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
పుట్టిన రోజులు వస్తుంటాయి.. పోతుంటాయనీ, కానీ వాటిని ఏ రకంగా వాడుకున్నామన్నదే ముఖ్యమని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజల కోసం చేస్తున్న పోరాటం తనకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కనీసం మానవత్వంతో స్పందిస్తుందన్న ఆశతో తన పుట్టినరోజు నాడు ఆందోళనకు దిగానని తెలిపారు. కాగా, నిరశన దీక్షకు దిగిన రామ్మోహన్ నాయుడికి మద్దతుగా టీడీపీ నేతలు గల్లా జయదేవ్, మురళీ మోహన్ నిరాహారదీక్షలో కూర్చున్నారు.