Facebook: మైదానంలో కోహ్లీ ప్రవర్తన చెత్తగా ఉంది.. అతని నైపుణ్యం మరుగున పడుతోంది!: నసీరుద్దీన్ షా
- కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిలా వ్యవహరించడం లేదు
- దేశం విడిచిపెట్టిపోవాలని తను నన్ను కోరవచ్చు
- ఫేస్ బుక్ లో స్పందించిన బాలీవుడ్ నటుడు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తన అత్యంత చెత్తగా ఉందని ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా విమర్శించారు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అయినప్పటికీ, అతని ప్రవర్తనతో ఆటతీరు, నైపుణ్యం, రికార్డులు మరుగున పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. క్రికెట్ మైదానంలో ఓ సారథిగా, అత్యుత్తమ ఆటగాడిగా కోహ్లీ ప్రవర్తించడం లేదని ఆయన స్పష్టం చేశారు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో ఓ వ్యక్తిని విమర్శించినట్లు కోహ్లీ తనను దేశం విడిచిపెట్టి పోవాలని చెప్పే అవకాశముందని చమత్కరించారు.
ఏదేమైనా, భారత్ ను విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. గతంలో కోహ్లీ ఆటతీరు తనకు నచ్చదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టిన సంగతి తెలిసిందే. కోహ్లీ కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్ల ఆటతీరు బాగుంటుందని కామెంట్ చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోహ్లీ, అయితే భారత్ ను విడిచిపెట్టి, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కు వెళ్లాలని సదరు నెటిజన్ పై మండిపడ్డాడు. తాజాగా ఆ ఘటనను గుర్తుచేసిన నసీరుద్దీన్ షా కోహ్లీని పరోక్షంగా దెప్పిపొడిచారు.