Prabhas: పక్కనే ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి, ప్రభాస్ గెస్ట్ హౌస్ మాత్రం సీజ్... మండిపడుతున్న బాధితులు!
- జేసీబీలతో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- ప్రభాస్ గెస్ట్ హౌస్ ను వదిలివేయడంపై విమర్శలు
- అన్నింటినీ తొలగిస్తామన్న అధికారులు
హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గం 'పైగా' భూమి ప్రభుత్వానిదేనంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో, అదే భూమిలో అక్రమ కట్టడంగా ఉన్న హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఆక్రమిత స్థలాల్లో ఉన్న ప్రహరీ గోడలను, ఇతర గదులను, పశువుల పాకలను జేసీబీలను తెచ్చి మరీ కూల్చి వేసిన అధికారులు ప్రభాస్ గెస్ట్ హౌస్ గేటుకు తాళం వేసి, నోటీసులు అంటించి వెళ్లడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది.
ప్రభాస్ గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ లేకపోవడంతోనే గేటుకు నోటీసు అంటించి, ఇది ప్రభుత్వ స్థలమన్న సూచికలను ఏర్పాటు చేశామని శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర వివరణ ఇచ్చినప్పటికీ, మిగతా నిర్మాణాలను కూల్చివేసి, గెస్ట్ హౌస్ ను వదిలి వేయడంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ నిర్మాణాలను కోల్పోయిన పేదలు మండిపడుతున్నారు.
కాగా, మూడు నెలల క్రితమే తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ, ఎన్నికల కారణంగానే ఇంతకాలమూ ఆక్రమణలను తొలగించే పనులు ప్రారంభించలేదని, ఈ స్థలంలోని అన్ని నిర్మాణాలనూ కూల్చి వేస్తామని అధికారులు అంటున్నారు.