Andhra Pradesh: పెళ్లి కారు ముసుగులో ఎర్రచందనం తరలింపు.. చిన్న లాజిక్ తో స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు!
- చిత్తూరు జిల్లా సరిహద్దులో ఘటన
- స్కోడా కారులో తరలించేందుకు స్మగ్లర్ల యత్నం
- చెన్నైకి వెళుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
ఎర్రచందనాన్ని తరలించడానికి స్మగ్లర్లు కొత్తకొత్త దారులను ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకూ అంబులెన్సులు, పాల ట్యాంకుల్లో మాత్రమే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసిన ప్రబుద్ధులు.. ఇప్పుడు ఏకంగా ఓ పెళ్లికారులో ఎర్రచందనం దుంగలను తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే అధికారులు కొంచెం అప్రమత్తంగా ఉండటంతో ఈ వ్యవహారం బట్టబయలయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకి నిన్న రాత్రి ఒక స్కోడా కారు బయలుదేరింది. కారును పెళ్లి వాహనంలా ముస్తాబు చేసిన స్మగ్లర్లు ఇందులో ఎర్రచందనం దుంగలు నింపారు. ఈ కారుపై పద్మ వెడ్స్ వాసు అని పోస్టర్ కూడా అంటించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు-తమిళనాడు సరిహద్దులో తనిఖీలు చేపడుతున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది దీనిని చూశారు.
అయితే అన్ సీజన్ లో పెళ్లి కారు వెళ్లడంపై అనుమానం వచ్చిన అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా డిక్కీతో పాటు కారు లోపల కూడా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఈ నలుగురిని ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నారు.