Andhra Pradesh: రేవంత్ రెడ్డి మాపై రెండు కుక్కలను వదిలారు.. ఆయన బెడ్రూమ్ అని మాకు తెలియదు!: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ

  • హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
  • రేవంత్ తలుపు తీయకపోవడంతో తోశామని వెల్లడి
  • గోడలకు సోలార్ ఫెన్సింగ్ అమర్చారని వివరణ

కొడంగల్ లోని కోస్గీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేశామని వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ హైకోర్టుకు తెలిపారు. రేవంత్ ను నేర విచారణ చట్టం మేరకే ముందస్తుగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కౌంటర్ ను దాఖలు చేశారు.

కొడంగల్ లో రేవంత్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు తొలుత బయటకు రావాల్సిందిగా ఆయన్ను కోరామని పోలీసులు తెలిపారు. కానీ ఎవరూ బయటకు రాకపోగా, పోలీసులపై రెండు కుక్కలను వదిలారని వెల్లడించారు. ప్రహరీగోడకు 10 అడుగుల ఎత్తులో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారన్నారు. దీంతో గత్యంతరం లేక రేవంత్ ఇల్లు గేటు తాళాన్ని పగలగ్గొట్టి లోపలకు ప్రవేశించామని పేర్కొన్నారు. చివరికి ఇంటిలోకి వెళ్లి తలుపు కొట్టామనీ, కానీ ఎవరూ తీయకపోవడంతో గట్టిగా తోశామని చెప్పారు.

ఈ సందర్భంగా ఆ తలుపు బోల్టు ఊడిపోయిందనీ, అది బెడ్రూమ్ అని తమకు అప్పటివరకూ తెలియదని వ్యాఖ్యానించారు. తాము మహిళా పోలీసులతో కలిసి ఇంటిలోకి రావడాన్ని రేవంత్ భార్య మొబైల్ తో వీడియో తీశారనీ, కానీ ఈ విషయమై సంతకం పెట్టేందుకు ఆమె నిరాకరించారని తెలిపారు. గతంలో కూడా రేవంత్‌రెడ్డి అనేకసార్లు చట్టాలను ఉల్లంఘించారనీ, అనుమతి లేకపోయినా ర్యాలీలు నిర్వహించారని చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై అనేక కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు.

Andhra Pradesh
Telangana
kodangal
Revanth Reddy
arrest
Police
High Court
  • Loading...

More Telugu News